కలెక్షన్స్ చెప్పడానికి భయమెందుకు ?
సంక్రాంతి సినిమాలు సెంచరీలు పూర్తి చేశాయి. డబుల్ సెంచరీలు చేశాయి. ఇంకా నాటౌట్ గా కొనసాగుతున్నాయి. ఒకరు 200 కోట్లతో పోస్టర్ వేస్తే, మరొకరు 220 కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్లు వదులుతున్నారు. ఐతే, ఈ వసూళ్లని నోటిమాటగా చెప్పడానికి మాత్రం భయపడిపోతున్నారు. మీడియా ముందుకొచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రబృందాన్ని సినిమా వసూళ్ల గురించి ప్రశ్న ఎదురైంది.
దానికి దిల్ రాజు, అనీల్ రావిపూడి నవ్వుతూ పక్కకు తప్పుకున్నారు. ఎందుకంటే ? ప్రస్తుతం పరిస్థితి చాలా సెన్సిటివ్ గా ఉందని, వసూళ్ల గురించి మాత్రం అడగొద్దని మీడియాను రిక్వెస్ట్ చేశారు. అనీల్ సుంకర మాత్రం ఓ అడుగు ముందుకేసి, సినిమా ఇంకా థియేటర్లలో ఉందని.. మరో వారం పోయిన తర్వాత పూర్తి ఫిగర్ బయటపెడతామని ప్రకటించాడు. ఇప్పటికే సంక్రాంతి సినిమాలవి ఫేక్ వసూళ్లు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చిత్రబృందం తీరుని చూస్తుంటే.. ఆ ప్రచారం నిజమనుకొనేలా ఉందనిపిస్తోంది.
రూ. 100కోట్ల షేర్, రూ. 200కోట్ల గ్రాస్ అంటూ పోస్టర్స్ విడుదల చేసినవారు ఆ ఫిగర్ ని మాటల్లో చెప్పడానికి భయమెందుకని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇక పదిరోజుల్లో సరిలేరు నీకెవ్వరు రూ. 101.97కోట్ల షేర్, రూ. 200కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చిత్రబృందం పోస్టర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక అల.. వైకుంఠపురంలో 10రోజుల్లో రూ. 143కోట్ల షేర్, రూ. 220కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ మేరకు చిత్రబృందం పోస్టర్స్ వదిలింది.