అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్ !
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించింది. దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితంలోని అనుభవాలని పంచుకున్నారు. తన 40యేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక మున్సిపల్ ఎన్నికలు చూశానని.. సాధారణంగా ఇలాంటి ఫలితాలు రావని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది ఎంతో కష్టంతో కూడుకున్న పని అన్నారు.
1994లో తాను టీడీపీలో ఉన్నప్పుడు అన్నగారు ఎన్టీరామారావుతో కలిసి తిరిగాను. అప్పట్లో తాము మద్య నిషేధం ప్రకటించాం. దాంతో ప్రజలు తమను బ్రహ్మాండంగా గెలిపించారు. ఐతే, మద్య నిషేధం కారణంగా ప్రభుత్వంపై కొన్నివేల కోట్ల భారం పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో సేల్స్ ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. ఆపై జరిగిన ఎన్నికల్లో మద్య నిషేధం సంగతి మర్చిపోయిన ప్రజలు సేల్స్ ట్యాక్స్ ను దృష్టిలో పెట్టుకుని తమను ఓడించారని సీఎం కేసీఆర్ వివరించారు.
రాజీవ్ గాంధీ మరణం సమయంలోనూ ఘనవిజయం సాధించిన తాను, సేల్స్ ట్యాక్స్ దెబ్బకు సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవ్వాల్సి వచ్చిందని చెప్పారు. కొన్ని నిర్ణయాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని చెప్పుకొచ్చారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయంపై సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ తరుపున, వ్యక్తిగతంగా తెలంగాణ ప్రజలకి కృతజ్ఝతలు తెలిపారు.