తెరాసపై 360డిగ్రీస్ నమ్మకం


మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పొంగిపోయారు. ఈ సాయంత్రం తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ విజయంతో ప్రజలు 360 డిగ్రీస్ లో తెరాసపై నమ్మకముంచారని అర్థమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. గత ఆరేళ్లుగా తాము అమలు చేస్తున్న పథకాలను, అవలంబిస్తున్న విధానాలని ప్రజలు అద్భుతంగా బలపరిచారన్నారు. 

“మేం పాటిస్తున్న 100 శాతం లౌకిక విధానం. కులాలు, మతాల విషయంలో సమాదరణ.. అందరినీ కలుపుకునిపోయే పద్ధతి ప్రజలకు బాగా నచ్చిందని ఈ సందేశం ద్వారా అర్థమవుతుంది. ఇటువంటి ప్రబలమైన తీర్పునిచ్చిన తెలంగాణ ప్రజానీకానికి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా శిరసు వంచి నమస్కరిస్తున్నా” అంటూ ఓటర్లకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.