ప్రజలకి కృతజ్జలు చెప్పిన కేటీఆర్

తెలంగాణలో తెరాసకు ఎదురేలేదని మరోసారి రుజువైంది. ఎన్నికలు ఏవైనా తెలంగాణలో తెరాస హవా కొనసాగుతూనే ఉంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లోనూ కారు జోరు చూపించింది. 120 మున్సిపాలిటీలకి గాను జరిగిన ఎన్నికల్లో దాదాపు వందకుపైగా స్థానాలని సొంతం చేసుకొంది. ఇక తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలోనూ జయభేరి మ్రోగించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకి బాధ్యత నాదేనని ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

గెలిచినా.. ఓడినా తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం క్రెడిట్ పూర్తిగా కేటీఆర్ దక్కాల్సిందే. ఈ ఘన విజయంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కేసీఆర్ గారి నాయకత్వంపై మరోసారి ప్రగాఢ నమ్మకం ఉంచినందుకు తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు. 100కి పైగా మున్సిపాలిటీలు, తొమ్మిదింటికి తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం మామూలు విషయం కాదు” అని కేటీఆర్ ట్విట్ చేశారు.