నేరేడుచర్ల పీఠం తెరాసదే !

రసవత్తరంగా మారిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలక ఛైర్మన్ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఇక్కడ తెరాస, కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అడ్డాలో ఎలాగైనా తన పాగా వేయాలనే పట్టుదలతో గులాబీ పార్టీ ఉండగా.. దానిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించడం ఆద్యంతం ఆసక్తిని రేపింది. ఫైనల్ గా నేరేడుచర్ల పురపాలిక పీఠం తెరాస వంశం అయింది. ఛైర్మన్ గా జయబాబు, వైస్ ఛైర్ పర్సన్ గా శ్రీలత ఎన్నికయ్యారు.

అంతకుముందు జరిగిన పురపాలక సమావేశం రసాభాసగా మారింది. కొత్తగా ఎన్నికైన పురపాలక సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ వాకౌట్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్స్ అఫిషియో ఓట్ల జాబితాను మళ్లీ మార్చడం.. తాజాగా షేరి సుభాష్ రెడ్డి, వెంకటేశ్వరుల పేర్లు చేర్చడాన్ని ఉత్తమ్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వార్డు సభ్యులతోపాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఉత్తమ్ రోడ్డుపై బైఠాయించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్ కి పంపించారు.