కలెక్టర్ కాబోతున్న ఈ కండక్టర్

పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ కండక్టర్. త్వరలోనే కలెక్టర్ కాబోతున్నాడు. కర్ణాటకలోని మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్‌సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్‌ కొలువు సాధించాడు. చదువులో పట్టుదల ఉన్న మధు ఐఏఎస్‌ కావాలని కలగన్నాడు.

అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్‌సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్‌ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్‌ స్టడీస్‌ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్‌ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్‌ లేదా ఎస్పీ పోస్ట్ వచ్చినట్టే. మధు ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్ లో కోచింగ్‌ తరగతులను చూస్తూ పరీక్షకు సిద్ధమయ్యాడు. సోషల్ మీడియాని సరిగ్గా వాడుకుంటే ప్రభుత్వం ఉద్యోగం కొట్టవచ్చని మధు రుజువు చేశాడు.