గంగుల గులాభి కోరిక నెరవేరేనా ?
తెలంగాణ మంత్రులంతా మంత్రి కేటీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కోరికని మంత్రులు ఎర్రబెల్లిదయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు బయటపెట్టారు. తాజాగా ఈ లిస్టులో మరో మంత్రి గంగుల కమలాకర్ చేరిపోయారు. గంగుల కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే సరిపోద్ది అనడం లేదు. దాంతో పాటు సీఎం కేసీఆర్ ని దేశానికి ప్రధానిగా చూడాలని ఆశపడుతున్నారు.
గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి గంగుల మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పనితీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దేశమంతా కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని.. రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలని గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
గంగుల రెండు కోరికల్లో ఒకటి నెరవేరడం ఈజీనే. ఈ యేడాది లేక వచ్చే యేడాదియో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. కానీ, కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలనే కోరిక ఇప్పట్లో నెరవేరడం కష్టం. అసలు అది తీరని కోరికగా మిగిలిపోవచ్చు కూడా. కానీ కేసీఆర్ సంకల్ప బలం గొప్పది. ఆయన తలుచుకుంటే దేశానికి ప్రధాని కావొచ్చేమో.