తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి

నిన్నా మొన్నటి దాక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస హవా చూపించింది. దాదాపు వన్ సైడ్ వార్ కనిపించింది. ఈ ఊపులోనే మరోసారి ఎన్నికలకి వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయాలని, 15 రోజుల్లో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. 

బుధవారం సీఎం కేసీఆర్ సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు వెంటనే జరిపించాలని సూచించారు. ఇన్ చార్జ్ ల పదవీకాలం ముగిసేలోగానే షెడ్యూల్ ను ప్రకటించాలని తెలిపారు. సీఎం ఆదేశాలతో అధికారులు సహకార సంఘాల ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలన్నీ పూర్తి చేస్తే అభివృద్ధి పనులపై మరింతగా ఫోకస్ పెట్టొచ్చన్నది సీఎం కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. దానికి తోడు మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం నేపథ్యంలో.. ఈ ఊపులోనే వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకి వెఌతే.. కలిసొస్తుందని సీఎం భావిస్తున్నారు.