రివ్యూ : అశ్వద్థామ

చిత్రం : అశ్వద్థామ (2020)

నటీనటులు : నాగశౌర్య, మెహ్రీన్, ప్రిన్స్, పోసాని తదితరులు

సంగీతం : శ్రీచరణ్ పాకాల, జిబ్రాన్ (నేపథ్య సంగీతం)

దర్శకత్వం : రమణ తేజ

నిర్మాత : ఐరా క్రియేషన్స్

రిలీజ్ డేటు : 31 జనవరి, 2019.

రేటింగ్ : 3/5

యంగ్ హీరో నాగ శౌర్యకు లవ్ స్టోరీస్ బోర్ కొట్టాయ్. దాంతో ఆయన థ్రిల్ అవ్వడంతో పాటు ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి సస్పెన్స్ థ్రిల్లర్ కథని ఎంచుకున్నాడు. అదే ‘అశ్వద్థామ’ సినిమా. స్వయంగా నాగ శౌర్యనే కథ అందించాడు. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదలై.. పూర్తయ్యే వరకు పెద్దగా అంచనాల్లేవ్. ఎప్పుడైతే అశ్వద్థామ ట్రైలర్ బయటికొచ్చిందో అప్పడే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయ్. ఓ బ్లాక్ బస్టర్ హిట్ రాబోతుంది అనేంతగా అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన అశ్వద్థామ ప్రేక్షకులని ఏ మేరకు థ్రిల్ చేసింది.. తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ : 

గుణ (నాగశౌర్య) విశాఖ కుర్రాడు. కొన్నాళ్లపాటు అమెరికాలో ఉండొస్తాడు. విశాఖలో అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత మరుసటి రోజే కనపడటం జరుగుతుంటుంది. ఆ తర్వాత మూడు నెలలకు గర్భవతులు అవుతుంటారు. ఇలాంటి పరిస్థితితే గుణ సోదరికి కూడా ఎదురువుతుంది. తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి గుణ రియాక్ట్ అయ్యాడు. విశాఖలో అమ్మాయిల కిడ్నాప్ వెనుక కుట్ర ఏమిటి? అమ్మాయిల కిడ్నాప్ చేసే ముఠాను గుణ ఎలా భగ్నం చేశాడు ? అనే ప్రశ్నలకు సమాధానమే అశ్వత్థామ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ 

* కథ-కథనం

* నాగ శౌర్య

* థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

* నేపథ్య సంగీతం

* యాక్షన్

మైనస్ పాయింట్స్ :

* సెకాంఢాఫ్ లో కాస్త సాగదీత

* కామెడీ

* రొటీన్ క్లైమాక్స్

ఎలా ఉందంటే ?

ఓ అమ్మాయిని ట్రాప్ చేయడమనే సీన్‌తో అశ్వద్థామ కథ ప్రారంభమవుతుంది. పవన్ కల్యాణ్ వాయిస్‌తో కుటుంబాన్ని పరిచయం చేయడం స్పెషల్‌గా ఉంటుంది. సినిమా మొదటి 30 నిమిషాలు కాస్త స్లోగా సాగినట్టు అనిపిస్తోంది. ఆ తర్వాత ఒక్కసారిగా కథలో వేగం పెరుగుతుంది. హీరో ఇంట్రడక్షన్, చెల్లెలు నిశ్చితార్థం, తాను అమితంగా ప్రేమించే చెల్లెలు ప్రియా ఆత్మహత్యకు పాల్పడటం ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక సెకాంఢాఫ్ కాస్త స్లోగా అనిపించినా.. కథలో ప్రేక్షకుడు లీనమయ్యేలా సాగుతోంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనే ఆసక్తి కలుగుతోంది. ఇంకా చెప్పాలంటే అమెరికన్ థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. ఐతే క్లైమాస్ ని ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

ఎవరేలా చేశారంటే ?

స్వయంగా నాగ శౌర్య రాసిన కథ ఇది. థ్రిల్లింగ్ కథాంశంలో యాక్షన్ హైలైట్ గా ఉండేలా స్క్రిప్ట్ ని రెడీ చేశాడు. యాక్షన్, సెంటిమెంట్ సీన్స్ లోనూ అదరగొట్టేశాడు. వన్ మేన్ షో చేశారు. అశ్వద్థామ విషయంలో నాగ శౌర్య వందశాతం పాసయ్యాడు. రమణ తేజ కొత్త దర్శకుడు కావడంతో కొన్ని చోట్ల తడబాటు కనిపించింది. మెయిన్ విలన్ గా నటించిన జిషుసేన్ గుప్తా నటన బాగుంది. నాగశౌర్య ప్రియురాలిగా మెహ్రీన్ కనిపిస్తుంది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆటపాటలకే పరిమితమైంది. పోసానితో పాటు ఇతర నటీనటులు తమ తామ పరిథి మేరకు నటించారు.

సాంకేతికంగా :

టెక్నికల్ అంశాలు బాగుంటేనే థ్రిల్లర్ సినిమాలు రక్తికడతాయి. అశ్వద్ధామ కోసం ఇద్దరు సంగీత దర్శకుడు పనిచేశారు. శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు. అశ్వద్థామ కథకి పాటలు అవసరం లేదు. పాటలు కథకి అండ్డంకిగా అనిపించాయి. ఇక జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. సినిమా స్థాయిని పెంచేలా జిబ్రాన్ నేపథ్య సంగీతం ఉంది. సినిమాలు మొదట్లో, సెకాంఢాఫ్ లో కొన్ని చోట్ల సినిమా స్లోగా సాగినట్టు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్స్ సీన్స్ అదిరిపోయాయ్. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : అశ్వద్థామ.. ఓ సస్పెన్స్ థ్రిల్లర్. కానీ, యాక్షన్ ప్రియులకి నచ్చుతుంది. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి అశ్వద్థామ మంచి ఆప్షన్. కానీ, కామెడీ కూడా కావాలంటే.. కాస్త ఆలోచించాల్సిందే.

రేటింగ్ : 3/5