జగన్ ప్రభుత్వం పగతో రగిలిపోతోంది

సీఎం జగన్ ప్రభుత్వం పగ.. పగ.. పగ అంటూ రగిలిపోతుందని ఆరోపించారు తెదేపా సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అనంతరం జిల్లా యాడికి ప్రాంతంలో ఆయనకి సంబంధించిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజును శుక్రవారం ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సంస్థకు కొనుప్పలపాడులో 649.86 హెక్టార్ల పరిధిలో సున్నపురాతి గనులను గతంలో లీజుకిచ్చారు. ఇప్పుడా లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

దీనిపై జేసీ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం పగ.. పగ.. పగ అంటూ రగిలిపోతోందన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పోల్చుకుంటే.. తనకు జరిగిందెంత ? అంటూ తనదైన శైలిలో సటైర్స్ వేశారు జేసీ. తన కంపెనీ లీజు ఎందుకు రద్దు చేశారో న్యాయస్థానంలో తేల్చుకుంటానని జేసీ ప్రకటించారు. ఎవడు మాట వినకపోయినా వాళ్ల మీద ప్రభుత్వం పగ తీర్చుకుంటుందని ఆరోపించారు.