రాహుల్ సూచనతోనే కోహ్లీ బరిలోకి దిగాడట

టీమిండియా కివీస్ పై బ్యాక్ టు బ్యాక్ సూపర్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. 3, 4వ టీ20 మ్యాచ్ ల్లోనూ కోహ్లీసేన సూపర్ ఓవర్స్ తోనే గెలిపొందింది. ‘ఈ రెండు మ్యాచ్‌ల ద్వారా ఒక కొత్త విషయం తెలుసుకున్నా. ప్రత్యర్థి జట్టు బాగా ఆడుతుంటే చివరి వరకు ప్రశాంతంగా ఉండటంతో పాటు తిరిగి పుంజుకోవాలని, అప్పుడే విజయం సాధిస్తామని అర్థమైంది. ఇంతకన్నా ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌లు జరగాలని మేం ఆశించలేదు. ఇదివరకు మేమెప్పుడూ సూపర్‌ ఓవర్‌లు ఆడలేదు. కానీ ఇప్పుడు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచాం’ అని కోహ్లీ అన్నారు.

ఇక శుక్రవారం నాల్గో టీ20 మ్యాచ్ లో ఓపెనర్ కె ఎల్ రాహుల్ ఇచ్చిన ఓ విలువైన సలహా ఫలించిందని కోహ్లీ తెలిపారు. సూపర్‌ ఓవర్‌లో తనకు బదులు సంజూ శాంసన్‌ను పంపాలనుకున్నానని, రాహుల్‌ చెప్పిన ఒక విషయంతో మనసు మార్చుకున్నానని కోహ్లీ తెలిపాడు. అనుభవం కలిగిన తానే బ్యాటింగ్‌కు రావాలని, తద్వారా అవకాశాలు మెరుగవుతాయని రాహుల్‌ చెప్పినట్లు కోహ్లీ తెలిపాడు. ఇక సూపర్ ఓవర్ లో టీమిండియాకు 14 పరుగులు అవసరం కాగా.. రాహుల్‌ తొలి రెండు బంతులను ఒక సిక్స్‌, ఒక ఫోర్‌ గా మలిచాడు. మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ 6పరుగులు చేసి పని పూర్తి చేశాడు.