కేరళలో మూడో కరోనా కేసు నమోదు

భారత్ లోనూ కరోనా వైరస్ క్రమంగా వ్యాపిస్తోంది. తాజాగా మూడో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కూడా దీన్ని ధ్రువీకరించింది. కేరళలోని కాసర్ గోడ్ లో ఓ వ్యక్తి వైరస్ బారిన పడ్డట్లు గుర్తించారు. బాధితుడు ఇటీవల వుహాన్ నుంచి కేరళ చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
 
కేరళ సరిహద్దులో ఉన్న కర్నాటకలోని మంగళూరు, కొడగు, చామరాజ్‌నగర్‌, మైసూరు ప్రాంతాల్లో కరోనా వైరస్‌ వ్యాపించి ఉందన్న అనుమానంతో 29 మంది నుంచి వైద్యులు రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. దీంతో ఆ రాష్ట్ర అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం సైతం వైరస్ వ్యాప్తి చెందకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. 

చైనా ప్రయాణంపై ఆంక్షలు విధించింది. చైనా పర్యాటకులకు, ఆ దేశం నుంచి భారత్ కు వచ్చే ఇతర దేశాల పర్యాటకులకు ఇ-వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వుహాన్ లో ఉన్న భారతీయుల్ని ప్రత్యేక విమానంలో భారత్ కు తెచ్చింది. పరిస్థితులపై కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు.