సీఏఏ, ఎన్ఆర్ సీ’లపై కేంద్రం వెనక్కి తగ్గిందా ?
రెండు నెలలుగా దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్ఆర్ సీ లకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. జాతీయ స్థాయిలో ఎన్ఆర్ సీ అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎన్ఆర్ సీ అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్ లోనే ప్రకటించారు. దీన్ని సమర్థిస్తూ అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు వ్యాఖ్యలు చేశారు. ఐతే, వీటికి భిన్నంగా దేశవ్యాప్త ఎన్ఆర్ సీపై తమ ప్రభుత్వం ఏనాడూ చర్చించలేదని ఓ సందర్భంలో ప్రధాని మోడీ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అసోంలో మాత్రమే దీన్ని అమలు చేశామని చెప్పారు. తాజాగా వీటికి బలం చేకూరుస్తూ లోక్ సభలో అధికారికంగా లిఖితపూర్వక ప్రకటన చేశారు.దీంతో సీఏఏ, ఎన్ ఆర్ సీలపై కేంద్రం వెనక్కి తగ్గనుందా ?అనే అనుమానాలు కలుగుతున్నాయి.