టాలీవుడ్ పై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్ 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. సినీ పరిశ్రమ సమస్యలని పరిష్కరించేందుకు చర్చలు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ మంగళవారం మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలతో సమావేశం అయ్యారు. చిరంజీవి ఇంట్లో ఈ సమావేశం జరిగింది. సుధీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేత, థియేటర్ల కొరత, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, షూటింగ్ పర్మిషన్లతో సహా లోకేషన్లలో మహిళల భద్రతపై చర్చించినట్టు తెలుస్తోంది.

గత రెండ్రోజులుగా సినీ పరిశ్రమ సమస్యలపై సినీ ప్రముఖులు సమావేశమై చర్చించారు. సోమవారం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చిరంజీవి, నాగార్జున సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సినీకార్మిక సంఘాల ప్రతినిధులు కొమర వెంకటేష్, హుమాయున్, సురేష్ దొరై, రాజేశ్వర్ రెడ్డి తదితరులు హజరయ్యారు.

ముందుగా సినీ పరిశ్రమ సమస్యలు ఏంటో గుర్తించిన తర్వాత.. వాటి పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. అవసరమైతే.. అతి త్వరలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఓ సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలోనే సినీ పరిశ్రమపై కేసీఆర్ వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.