సీఏఏపై రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు నెలలుగా దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్ లకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోదీనిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తొలిసారి స్పందించాడు. ఈ చట్టంతో భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదని, ఒకవేళ ఈ చట్టంతో ముస్లింలకు ఏదైనా ముప్పు జరిగితే వారి తరఫున పోరాడ మొదటి వ్యక్తిని తానేనన్నారు. భారత్, పాక్ విడిపోయిన అనంతరం భారత్లోనే ఉండాలని నిశ్చయించుకున్న కోట్లాది మంది ముస్లింలను దేశం నుంచి పంపిస్తారని ఎలా అనుకుంటున్నారని రజనీ ప్రశ్నించారు.
అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులను గుర్తించేందుకు ఎన్పీఆర్ చాలా ముఖ్యమైందని రజనీ అభిప్రాయపడ్డారు. రజనీ తాజా వ్యాఖ్యలతో ఆయన భాజాపా మద్దతుదారుడు అనే ప్రచారానికి మరింత మద్దతు దొరికినట్టయింది. మరోవైపు, సీఏఏ, ఎన్పీఆర్ లకి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్ లో కేంద్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సీఏఏ, ఎన్పీఆర్ లపై ఇప్పటి వరకు ఎలాంటి పని మొదలు పెట్టలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఏఏ, ఎన్పీఆర్ లపై కేంద్రం వెనకడుగు వేసిందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.