మేడారంలో గవర్నర్లు పూజలు 

తెలంగాణలో మేడారం జాతర ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన మొదలైన జాతర ఈ నెల 8వ వరకు కొనసాగనుంది. ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుకుంది. ఈరోజు (ఫిబ్రవరి 7) భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మేడారం సమ్మక్క-సారలమ్మ సేవలో పాల్గొన్నారు.

మేడారం జాతరకు చేరుకున్న గవర్నర్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతిరాథోడ్‌, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు. ములుగు ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపి స్వాగతం పలికారు. వనదేవతలకు గవర్నర్లు, మంత్రులు పూజలు చేసి ముడుపులు సమర్పించుకున్నారు. గవర్నర్లు నిలువెత్తు బంగారం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక రేపు (ఫిబ్రవరి 8) దేవతల వన ప్రవేశం ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర ఇది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది.