నూర్ భాయ్ కుటుంబానికి చరణ్ ఆర్థికసాయం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నాడు. మెగా కుటుంబానికి వీరాభిమాని అయిన నూర్‌భాయ్‌ కొంతకాలం క్రితం గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి, అల్లు అర్జున్‌ నూర్‌భాయ్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. 

ఐతే, ఆ సమయంలో విదేశాల్లో ఉన్న రామ్‌చరణ్‌.. ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు రాగానే నూర్‌భాయ్‌ను కుటుంబాన్ని కలుస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చెర్రీ హైదరాబాద్‌లో నూర్‌భాయ్‌ కుటుంబాన్ని కలిశారు. వారితో మాట్లాడి రూ.10 లక్షల చెక్కును ఆర్థిక సాయంగా అందించారు. అంతేకాకుండా నూర్‌ భాయ్‌ కుమారుడికి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని, అలాగే ఇద్దరు ఆడపిల్లల వివాహానికి వస్తానని చెర్రీ మాట ఇచ్చారు. నూర్‌భాయ్‌ కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటానన్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఇది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుపాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు. వచ్చే యేడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలోనూ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారమ్.