సల్మాన్’తో పూజా హెగ్డే రొమాన్స్


బాలీవుడ్ లోనూ రాణించాలని.. అక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని ఆశపడుతోంది పూజా హెగ్డే. ఆమె ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో రొమాన్స్ చేసింది. వీరిద్దరు జంటగా నటించిన ‘మెహంజదారో’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోవాలన్న పూజా ఆశలు ఆలస్యం అయ్యాయి. తాజాగా పూజాకు బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చింది. ఏకంగా సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఫర్జాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించనున్న సినిమా ‘కబి ఈద్ కబి దివాళి’. సాజిద్ నడియడ్వాల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకున్నారు. సల్మాన్ సరసన నటించడం పూజాకు ఇదే తొలిసారి. ఈ సినిమా హిట్టయితే.. బాలీవుడ్ లోనూ పూజా హవా మొదలైనట్టేనని చెబుతున్నారు. 

ఇక టాలీవుడ్ లో పూజా హవా కొనసాగుతోంది. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ తో రెండుసార్లు, ఎన్ టీఆర్, మహేష్ బాబు లతో ఒక్కోసారి జతకట్టింది. ప్రస్తుతం రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రభాస్ సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలోనూ పూజానే హీరోయిన్ అనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లోనూ పూజా హవా కనిపిస్తోంది.