వైకాపాలో చేరిన జనసేన కీలక నేత
జనసేన పార్టీకి మరో షాక్. ఆ పార్టీ నుంచి మరో కీలక నేత బయటికి వెళ్లారు. ఇటీవలే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనని వీడిన సంగతి తెలిసిందే. అధినేత పవన్ కల్యాణ్ కి స్థిరత్వం లేదు. మళ్లీ సినిమాలు చేయను. పూర్తిగా ప్రజాసేవకే అంకితమవుతానని చెప్పిన పవన్.. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం నచ్చకే పార్టీని వీడుతున్నట్టు జేడీ తెలిపారు. తాజాగా విశాఖ మరో నాయకుడు జనసేనకు గుడ్‌బై చెప్పారు. గాజువాక సీనియర్ నాయకుడు కరణం కనకారావు బుధవారం జనసేన పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి సమక్షంలో కనకారావు వైకాపాలో చేరారు. కనకారావును పార్టీ కండువాతో సాదరంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆహ్వానించారు. కనకారావుతో పాటు 200 మంది జనసైనికులు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం విశేషం. గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందిన సంగతి తెలిసిందే. జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కూడా వైకాపాకి మద్దతిస్తూ.. ఆ పార్టీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు.