రివ్యూ : వరల్డ్ ఫేమస్ లవ్వర్ – బోర్ కొట్టాడు

చిత్రం : వరల్డ్ ఫేమస్ లవ్వర్ (2020)

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే తదితరులు

సంగీతం :  గోపీ సుందర్

దర్శకత్వం : క్రాంతి మాధవ్

నిర్మాత : కె.ఎ వల్లభ

రిలీజ్ డేట్ : 14 ఫిబ్రవరి, 2020

రేటింగ్ : 2.75/5

రౌడీ హీరో విజయ్ దేవరకొండ టార్గెట్ ఒక్కటే. కొడితే సిక్స్ పడాల్సిందే. ఇప్పటికే ఆయన మూడ్నాలుగు సిక్సులు కొట్టేశారు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇందులో బాల్ స్టేడియం బయటపడిన సినిమాలు ఉన్నాయి. ఈ సారి కూడా విజయ్ సిక్స్ కొట్టాలనే బరిలోకి దిగాడు. అదే ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’. క్రాంతి మాధవ్ దర్శకుడు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే హీరోయిన్స్. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా వరల్డ్ ఫేమస్ లవ్వర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. అనుకున్నటే విజయ్ సిక్స్ కొట్టాడా.. ? డకౌంట్ అయ్యాడా.. ? సింగిల్, డబుల్ తో సరిపెట్టుకున్నాడా ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశి ఖన్నా) కాలేజీ టైంలోనే ప్రేమలో పడతారు. ఐతే, వీరి ప్రేమకు పెద్దలు అడ్డుపడతారు. దీంతో ఇద్దరు సహజీవనం చేస్తుంటారు. గౌతమ్ కార్పోరేట్ ఉద్యోగాన్ని వదిలేసి.. తనకిష్టమైన రైటింగ్ మీద ఫోకస్ పెడతాడు. యామిని కూడా అతడిని సపోర్ట్ చేస్తుంది. అయితే, కొన్ని కారణాల వలన యామిని  గౌతమ్ కి దూరమవుతుంది. ఇక్కడి నుంచి  గౌతమ్ జీవితం ఎలా మలుపు తిరిగింది ? గౌతమ్ ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ కథ ఏ రేంజ్ లో హిట్ అయింది ? ఇంతకీ ఆ కథలో ఏముంది ? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

* విజయ్ దేవరకొండ

* కొత్తగూడెం ఏపీసోడ్

* ఐశ్వర్య రాజేష్, రాశీఖన్నాల నటన

మైనస్ పాయింట్స్ :

* కథ-కథనం

* సంగీతం

* సెకాంఢాఫ్

ఎలా ఉంది ?

రచయితగా మారిన గౌతమ్ మన తెరపై చూసిన కథేనే రాస్తాడు. ఆ కథ సూపర్ హిట్ అవుతోంది. ఏకంగా 50 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టిస్తుంది. చదివిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు. కన్నీళ్లు పెట్టేసుకుంటారు. గౌతమ్ లక్షల మంది అభిమానులుగా మారుతారు. క్లైమ్కాస్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఐతే, క్లైమాక్స్ లేకుండా ప్రచురితమైన ఈ కథకి గౌతమ్ ఎలాంటి ముగింపునిచ్చాడనే ఆతృతతో ఎదురు చూస్తుంటారు. మరీ.. థియేటర్స్ లో సినిమా చూసిన ప్రేక్షకులకి వరల్డ్ ఫేమస్ లవ్వర్ ఆ రేంజ్ లో కనెక్ట్ అయిందా ? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ? సినిమా పడుతూ.. లేస్తూ సాగింది.

క్రాంతి మాధవ్ కథని ఆసక్తిగా ప్రారంభించాడు. ఐతే, ప్రేక్షకులని కథలో లీనం చేయడంలో తడబడ్డాడు. కొత్తగూడెం ఏపీసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ ఏపీసోడ్ చూస్తున్నంత సేపు ఇదో ప్రత్యేకమైన సినిమా అనిపిస్తుంది. ఈ ఏపీసోడ్ లో ఐశ్వర్యా రాజేష్ అద్భుతంగా నటించింది. ఆ తర్వాత మాత్రం సినిమా బోరింగ్ మారింది. గౌతమ్ రాసుకున్న కథలో రెండు ఉపకథలు ఉన్నాయి. ఒక్కటి కొత్తగూడెం ఏపీసోడ్, మరోటి ఫారిన్ ఏపీసోడ్. ఇందులో కొత్తగూడెం ఏపీసోడ్  హిట్టయింది. ఫారిన్ ఏపీసోడ్ ప్లాప్ అయింది. ఫలితంగా.. ప్రేక్షకుడు సినిమాని ఆమాంతం ఎంజాయ్ చేసేలా లేదు.

ఎవరెలా చేశారు ?

వాస్తవం నుంచి కథలోకి వెళ్లే సినిమా ఇది. వాస్తవంలో రాశీఖన్నాతో ప్రేమ, సహజీవనం నేటి తరాన్నితలపిస్తాయి. ఇక గౌతమ్ ఊహ కథలో లవ్ స్టోరీలో కొత్తగూడెం ఏపీసోడ్ ఆకట్టుకుంది. దీంతో  గౌతమ్  కథ సూపర్ హిట్ అనుకొన్నారు. కానీ, ఆరంభం మాత్రమే హిట్.. ఆ తర్వాత బోరింగ్ అని తేలిపోయింది. ఇక విజయ్ నటనకి వంకపెట్టలేం. నలుగురితో లవ్వర్ గా అద్భుతంగా నటించాడు. ఏ ఏపీసోడ్ కి తగ్గట్టుగా తనని తాను మలుచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే సినిమా అంతా తన భుజాలపై  మోసేందుకు ప్రయత్నించాడు. యామినిగా రాశీఖన్నా నటన ఆకట్టుకుంది. ఆ పాత్రకి ఎమోషన్ టచ్ ఇచ్చారు. ఐశ్వర్యరాజేష్ నటన సినిమాకే హైలైట్. మిగితా ఇద్దరు హీరోయిన్స్ కేథరిన్, ఇజాబెల్లే ఓకే అనిపించారు.

సాంకేతికంగా :
ప్రేమకథలకి మంచి సంగీతం అందిస్తుంటారు గోపీ సుందర్. ఐతే, వరల్డ్ ఫేమస్ లవ్వర్ కి మాత్రం ఆయన న్యాయం చేయలేకపోయాడు. పాటలు సాదాసీదాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడింగ్ ఓకే. బోరింగ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా : ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’ కాదు వరల్డ్ బోరింగ్ లవ్వర్

రేటింగ్ : 2.75/5