పాపం పండింది.. మార్చి 3న నిర్భయ దోషులకి ఉరిశిక్ష అమలు !
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కోసం కొత్త డేటు ఖరారైంది. మార్చి 3న నిర్భయ దోషులు నలుగురిని ఉరితీయాలని ఢిలీ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట జనవరి 22, ఆ తర్వాత ఫిబ్రవరి 1కి నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే, దోషులు న్యాయ వ్యవస్థలోని అన్నీ అవకాశాలని వినియోగించుకుంటూ ఉరిశిక్ష అమలు ఆలస్యం అయ్యేలా చేశారు. ఇక దోషులు వినియోగించుకోవాల్సిన అన్నీ రకాల న్యాయ అవకాశాలు ముగిశాయి. దీంతో.. నిర్భయ కేసులో నలుగురు దోషులకి ఒకేసారి మార్చి 3న ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీ పాటియాల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు. దాదాపు 12రోజులు చావుతో పోరాడి నిర్భయ డిసెంబర్ 29న కన్నుమూసింది.
2012 డిసెంబర్ 17 ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. 2013 మార్చి 11న నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
జువైనల్ ని జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది.. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది. ఇక మిగిలిన నలుగురికి 2013 సెప్టెంబర్ 13న ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ.. ఉరిశిక్ష విధించింది. న్యాయపరమైన చిక్కులు అన్నీ తొలగి.. మార్చి 3న నలుగురు నిందితులకి ఉరిశిక్షని అమలు చేయనున్నారు.