టీటీడీ నుంచి ఏపీ ప్రభుత్వానికి రూ. 2,300 కోట్లు బదిలీ !

తితిదేకు చెందిన రూ. 2,300 కోట్లను ఏపీ ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ పేరుతో ట్విటర్‌లో జరుగుతున్న ప్రచారమిది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ప్రచారంలో అసలు నిజం లేదు. అసలు అది అజిత్‌ ఢోబాల్‌ ట్విటర్ ఖాతాయే కాదన్నారు.

అది నకిలీ ఖాతాగా తితిదే అధికారులు పరిశీలనలో తేలిందని చెప్పారు. దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. జాతీయ భద్రతా సలహాదారు పేరుతో చేసే దుష్ప్రచారాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని.. నకిలీ ఖాతాలతో ప్రచారం చేసే వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని సుబ్బారెడ్డి హెచ్చరించారు. త్వరలోనే తిరుమలలో సైబర్‌ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.