బీజేపీలో చేరిన వీరప్పన్ కూతురు

గంధపుచెక్కల స్మగ్లర్, అడవిదొంగ వీరప్పన్ కూతురు విద్యారాణి బీజేపీలో చేరారు. తెలంగాణకు చెందిన ప్రముఖ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ప్రస్తుతం తమిళనాడు వ్యవహారాల ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఆంధ్రా-కర్నాటక-తమిళనాడు సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లా కేంద్రంలో శనివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన.. వీరప్పన్ కూతురికి కాషాయకండువాకప్పి బీజేపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన విద్యారాణి తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా నాన్న వీరప్పన్ ఎంచుకున్నది. బతికున్నంతకాలం నడిచింది ముమ్మాటికీ తప్పుడు మార్గమే. ఆ విషయంలో నాకుగానీ, మా ఫ్యామిలీకిగానీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ ఆయన ఆ పని ఎందుకు చేశారన్నదే ఇక్కడ ముఖం. చివరిశ్వాస వరకూ పేదల కోసమే బతికిన వ్యక్తి వీరప్పన్. ఇప్పటికీ కొన్ని వందల గ్రామాలు ఆయనను దేవుడిలా కొలుస్తాయంటే.. నాన్న ఎలాంటివారో అర్థంచేసుకోవచ్చు. బడుగుబలహీన వర్గాలు, అడవిబిడ్డలు బాగుండాలన్న ఆయన లక్ష్యాన్ని సాధించడానికే నేనివాళ బీజేపీలో చేరుతున్నా’ అన్నారు. 

వీరప్పుడు ఒకప్పుడు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్ని గడగడలాడించిన ఆయనను 2004లో సిట్ బృందం మట్టుపెట్టిన సంగతి తెలిసిందే.