అప్పుడే కోహ్లీపై విమర్శలా ?

వన్డే సిరీస్ లో టీమిండియాకు గుండుకొట్టింది కివీస్. తొలి టెస్టులోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి టెస్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో (2), (19) విఫలమవ్వడంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయ్. అతడి మరింత క్రమశిక్షణగా ఆడాల్సిందని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. 

ప్రత్యర్థులు లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేస్తే పరుగులు సాధించాలనుకుంటారని చెప్పాడు. కివీస్‌ బౌలర్లు అందుకు విరుద్ధంగా బంతులేశారని, విరాట్‌ పరుగులు తీసేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. స్టంప్స్‌ పైకి బంతి విసిరితే పరుగులు చేస్తున్నాడని, షార్ట్‌పిచ్‌ బంతులేస్తే కోహ్లీ మీదకు వెళ్తున్నాయని వివరించాడు. అలాంటప్పుడు తొలి ఇన్నింగ్స్ లో విలియమ్ సన్ ఆడినట్టు ఆడితే.. పరుగులు చేయొచ్చని లక్ష్మణ్ అన్నారు.

మూడో రోజు ఆటముగిసే సరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అజింక్య రహానె(25), హనుమ విహారి(15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కివీస్‌ కన్నా భారత్‌ 39 పరుగుల వెనుకంజలో ఉంది. వీళ్లిద్దరి బ్యాటింగ్‌పైనే టీమ్‌ఇండియా ఫలితం ఆధారపడి ఉంది.