ట్రంప్ ప్రసంగంలో బాలీవుడ్ సినిమాలు, క్రీడాకారులు.. !

భారత పర్యటనకి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ఆసక్తికర ప్రసంగం చేశారు. భారతీయ సినిమాలని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతీయ సినిమాలని ప్రపంచం ఇష్టపడుతుందన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ‘దిల్‌వాలే దుల్హానియో లే జాయేంగే’ సినిమాను ప్రస్తావించారు. ఆ సినిమాని ప్రపంచం మొత్తం ఇష్టపడిందని ట్రంప్ పేర్కొన్నారు.

భారత్ నుంచి అన్నిభాషల్లో కలిపి యేడాదికి దాదాపు 2వేలకుపై సినిమాలొస్తున్నాయ్. అవి మిగిలిన దేశాలతో భారత్‌ అనుబంధాలు పెరగడానికి కూడా కారణమవుతున్నాయన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్దపీట వేస్తుందని ట్రంప్ ప్రశంసలు కురిపించారు. క్రికెట‌ర్లు స‌చిన్‌, విరాట్ కోహ్లీల‌ను భార‌తీయులు ఆద‌రిస్తున్న తీరును కూడా ట్రంప్ కొనియాడారు.  మోదీని ప్ర‌తి ఒక్క‌రూ ప్రేమిస్తార‌ని, కానీ ఆయ‌న చాలా ట‌ఫ్ వ్య‌క్తి అని ట్రంప్ చెప్పడం విశేషం.