తాజ్ మహల్ గురించి ట్రంప్ ఏం రాశారంటే ?


భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజ్ మహల్ ను వీక్షించారు. ఆ పురాతన పాలరాతి కట్టడం విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ట్రంప్‌ కుమార్తె ఇవాంక, అల్లుడు కుష్నర్‌లు కూడా తాజ్‌మహల్‌ను వీక్షించారు. అనంతరం అక్కడ ఫొటోలు దిగారు. తాజ్‌ విశిష్టత గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాశారు. “భారత మహోజ్వల సంస్కృతి, భిన్నత్వంలో ఏకత్వానికి తాజ్ మహల్ తార్కాణంగా నిలుస్తోంది. ఈ కట్టడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది” అని రాశారు. అంతకుముందు ట్రంప్ ఆగ్రాకి విచ్చేస్తున్న సమయంలో ఆయనకి రహదారి వెంట సాదర స్వాగతం లభించింది. రోడ్డుకు ఇరువైపులా దాదాపు 25వేల మంది విద్యార్థులు భారత్ అమెరికా జెండాలతో ఆయనకు స్వాగతం పలికారు. కొందరు కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.