అభిమాని శరీరంపై పచ్చబొట్టుపై కేటీఆర్ అసంతృప్తి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. ఆ అభిమానాన్ని వివిధ సందర్భాల్లో, వివిధ రూపాల్లో చూపిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి కేటీఆర్‌ మీద తనకున్న అభిమానాన్ని భిన్నంగా తెలియజేశాడు. కేటీఆర్‌కు వీరాభిమాని అంటూ ఆయన బొమ్మను ఏకంగా శరీరంపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు. ‘యంగ్‌ డైనమిక్‌ లీడర్‌.. జై రామ్‌ అన్న’ అంటూ రవి కిరణ్‌ అనే వ్యక్తి వీపుపై పచ్చబొట్టు వేసుకున్నాడు. దీన్ని ఫోటో తీసీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి కేటీఆర్‌ను ట్యాగ్‌ చేశాడు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఇది నిజమా.. క్షమించు బ్రదర్‌ నేను ఇలాంటి వాటికి మద్దతివ్వను. అలాగే ప్రోత్సహించను. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మంచిది కాదు.’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే నెటిజన్స్ మాత్రం అభిమాని చేసిన పనిని అభినందిస్తున్నారు. ‘జై కేటీఆర్‌’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ‘ప్రేమను వ్యక్త పరిచే మార్గాలు అనేకం ఉన్నాయి. అంత ప్రేమ ఉంటే మొక్కలు నాటండి. అందరికి మేలు చేస్తుంది’ అంటూ సూచనలు చేస్తున్నారు.