ఢిల్లీ అల్లర్లపై సెహ్వాగ్ ఆవేదన

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఢిల్లీలోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయి దాటడంతో.. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. ఆందోళనల్లో దాదాపు 180మంది గాయపడ్డారు. వీరిలో 48మంది పోలీసులు ఉన్నారు.

తాజాగా ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న ఘటనలపై టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఢిల్లీలో ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఎంతో దురదృష్టకరం. దిల్లీలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఢిల్లీలో ఎవరికి గాయమైనా అది ఎంతో గొప్ప దేశమైన భారతదేశపు రాజధానికే మచ్చ. ప్రతి ఒక్కరూ శాంతి స్థాపనకు కృషి చేయాలి” అని సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా కోరాడు.