తెదేపాకి బిగ్ షాక్.. డొక్కా రాజీనామా !

స్థానిక సంస్థల ఎన్నికల ముందు తెదేపా పెద్ద షాక్ తగిలింది. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్.. తాజాగా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తెదేపా తీరుపై మండిపడ్డారు. రాజధాని రైతుల జేఏసీ పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని డొక్కా అన్నారు. తెదేపా నేతల చౌకబారు విమర్శలను తీవ్రంగా ఖండించారు.

2019 ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించా. కానీ ఓడిపోతానని తెలిసినా ప్రత్తిపాడు సీటు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా టిడిపి అధిష్టానం తీరు తనను మానసికంగా కలచివేసిందన్నారు. శాసనమండలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే తాను వైసిపి కి మానసికంగా దగ్గరయ్యానని.. వైసీపీలో చేరే విషయంపై చెప్పకనే చెప్పేశారు డొక్కా. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో డొక్కా మాణిక్య వరప్రసాద్ మంత్రిగా పనిచేశారు. ఆయన హఠాన్మరణం అనంతరం కే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. శాసన మండలికి ఎన్నికయ్యారు. 2019లో ఎన్నికల్లో ఆయన తాడికొండ సీటుని ఆశించారు. కానీ, ఆయనకి ప్రత్తిపాడు సీటు దక్కింది. దాంతో.. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు.