అమృతని అడ్డుకున్న కుటుంబ సభ్యులు
మిర్యాలగూడలోని హిందూ శ్మశానవాటికలో మారుతీ రావు అంత్యక్రియలు జరిగాయి. అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కుమార్తె అమృత ప్రయత్నించింది. మృతదేహాన్ని చూసేందుకు తనకు పోలీసు భద్రత కావాలని ఈ ఉదయం కోరింది. ఈ మేరకు ఆమె పోలీసు భద్రత మధ్య తన తండ్రిని కడసారి చూసేందుకు శ్మశానవాటికకు చేరుకుంది. అయితే ఆమె రాకను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మృతదేహం వద్దకు రాకుండా అమృతను బంధువులు అడ్డుకున్నారు. దీంతో ఆమె తండ్రి మృతదేహాన్ని చూడకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.
కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. 2018లో కిరాయి హంతకులతో కూతురు భర్త ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించారు మారుతీరావు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ సూసైడ్ లెటర్ రాసి.. విషం తాగి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గిరిజ నన్ను క్షమించి.. అమృత అమ్మ దగ్గరికి వెళ్లు అని సుసైడ్ నోట్ లో రాసినట్టు పోలీసులు తెలిపారు. ఇక మారుతీరావు అంతిమయాత్రలో స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు, మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.