పబ్ గొడవని సీరియస్ చేసిన ప్రకాష్ రాజ్

ఇటీవల ఓ పబ్‌లో బిగ్ బాస్ 3 విజేత, సింగర్ రాహుల్‌పై కొందరు దాడి చేసిన సంగతి తెలిసిందే. సీసాలతో ఆయన్ను కొట్టారు. ఈ దాడికి పాల్పడింది తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, అతడి స్నేహితుల గ్యాంగ్ అని రాహుల్ తెలిపాడు. ఈ ఘటన వీడియోను రాహుల్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేశారు. తనకు న్యాయం జరగాలని కోరారు. తప్పు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. కొందరు నాయకులు పదవుల్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే మంత్రి కేటీఆర్ నుంచి రాహుల్ కి ఎలాంటి రియాక్షన్ వచ్చినట్టు లేదు.

ఈ నేపథ్యంలో రాహుల్ కోసం ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగారు. వీరిద్దరు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌ను అసెంబ్లీలో కలిశారు. పబ్‌లో రాహుల్‌పై జరిగిన దాడి ఘటన గురించి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రకాష్ “రాహుల్‌పై దాడి చేయడం తప్పు. అతడి వెంట ఎవరూ లేరనుకోవద్దు. అతడికి మేమున్నాం, చాలా మంది అభిమానులు ఉన్నారు. పబ్‌లోకి వెళ్లడం తప్పని నేను చెప్పడం లేదు. కానీ సీసాలతో అలా కొట్టడం ఏంటి? చంపేస్తారా ఏంటి? ఆ అహంకారం తప్పు. ఒకడ్ని పట్టుకొని పది మంది కొడతారా.. రాహుల్‌కి రాజీపడే ఉద్దేశం లేదు. అయినా ఎందుకు రాజీపడాలి. తప్పుచేసిన వాడే రాజీపడతాడు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకోమని రేపు కమిషనర్‌తో చెబుతా”నన్నారు.

వాస్తవానికి పబ్ లో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే. రాహుల్ కి ప్రత్యేక్ష సపోర్ట్ లేకపోవడంతో ఇష్యూ అంత సీరియస్ అవ్వలేదు. ఇప్పుడు రాహుల్ కోసం ప్రకాష్ రాజ్ దిగడంతో పబ్ గొడవ సీరియస్ అయ్యేలా కనబడుతోంది. ప్రకాష్ దారిలో వచ్చి మరికొందరు సినీ ప్రముఖులు రాహుల్ కి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డిపై చర్యలు తీసుకోక తప్పదు. మరీ.. ఫైనల్ గా ఈ గొడవపై కాంప్రమైజ్ అవుతారా ? కేసులు, అరెస్ట్ లు అంటూ పోలీస్ స్టేషన్, కోర్టుల వరకు వెళ్తారా ?? అన్నది చూడాలి.