ఇక మినీ ఐపీఎల్ మాత్రమే
మినీ ఐపీఎల్ మాత్రమే నిర్వహించాల్సి ఉంటుందన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జే షా శనివారం సమావేశం అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత దాదా మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌ను కుదిస్తారా ? అన్న ప్రశ్నకు.. అవునూ అదే జరుగుతుంది అన్నారు గంగూలీ.
‘అదే జరుగుతుంది. ఒకవేళ ఏప్రిల్ 15న టోర్నీ ఆరంభమైనా 15 రోజులు పోయినట్టే కదా. కుదించాల్సిందే. ఎన్ని రోజులు, ఎన్ని మ్యాచులు తగ్గిస్తామో ఇప్పటికైతే చెప్పలేను’ అని గంగూలీ స్పష్టం చేశారు. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో జనాలు గుమిగూడకుండా చూడాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో నిర్వహించే ప్రతి టోర్నీని వాయిదా వేశారు.