తెలంగాణలోనూ విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ బంద్ !

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, థియేటర్స్ మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలని నిర్వహిస్తోంది.

ఇక కరోనా ఎఫెక్ట్ అన్నీ రంగాలపై పడుతోంది. సినిమా షూటింగ్స్, సినీ ఫంక్షన్స్, సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నాయి. కరోనా ప్రభావంతో ఈ నెల 29 నుంచి జరగాల్సిన ఐపీఎల్ వచ్చే నెల 15కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్థిక, క్రీడా, సినీ.. ఇలా ఏ రంగాన్ని కూడా కరోనా వదిలిపెట్టడం లేదు.