హైకోర్టు ఆదేశం.. పదో తరగతి పరీక్షలు వాయిదా !

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీని అత్యవసరంగా విచారించిన హైకోర్టు పదో తరగతి పరీక్షలని వాయిదా వేయాలని ఆదేశించింది. 

రేపు జరగాల్సిన పరీక్ష మాత్రం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న తరుణంలో పరీక్షలు కొనసాగించడం సమంజసం కాదని పిటిషనర్ తరఫు న్యాయవాది పవన్ కుమార్ వాదించారు. విద్యార్థులు కూడా ప్రశాంతంగా చదవలేని గందరగోళ పరిస్థితులు ఉన్నందున పరీక్షలు వాయిదా వేయాలని లేదా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. పరీక్షలని వాయిదా వేయాలని ఆదేశించింది.