నిర్భయ దోషులని ఉరితీశారు ఇలా.. !

ఈ సారి ఉరి డేటు వాయిదా పడలేదు. ఆఖరి నిమిషం వరకు నిర్భయ దోషుల లాయర్  చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో.. నిర్భయ దోషులైన ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లను తిహార్‌ జైలులో ఉరి తీశారు. పలువురు జైలు అధికారులతోపాటు, జిల్లా మెజిస్ట్రేట్‌ సమక్షంలో ఇవాళ ఉదయం 5.30 గంటలకు జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేశారు.

నిర్భయ దోషులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ సుప్రీం తలుపులు తట్టారు. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. ఉరిని యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. దీంతో ఉరి శిక్షని అమలు చేశారు. తలారి పవన్‌ జల్లాద్‌ ఉరిశిక్ష ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సమయంలో 17 మంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. 48 మంది పోలీసులు రక్షణగా ఉన్నారు.