ఆలస్యమైంది.. కానీ న్యాయం జరిగింది !
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత నిర్భయ దోషులకు ఉరి అమలైంది. ఈరోజు ఉదయం 5.30గంటలకు జైలు నిబంధనల ప్రకారం దోషులు ముకేష్ సింగ్'(32), పవన్ గుప్త(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్(31)లకు తిహార్ జైలులోని జైలు నెంబరు 3లో తలారి పవన్ జల్లాద్ ఉరిశిక్ష ప్రక్రియను పూర్తి చేశారు. దోషుల ఉరిపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
“నా కుమార్తెకు ఇన్నాళ్లకు న్యాయం జరిగింది. ఆలస్యమైనప్పటికీ చివరకు న్యాయమే గెలిచింది. దోషుల ఉరితో నిర్భయ ఆత్మ శాంతిస్తుంది. ఈ క్రమంలో సహకరించిన న్యాయవ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు. ఉరి తప్పించుకోవడానికి దోషులు చివరి వరకు చేసిన అన్ని ప్రయత్నాల్ని కోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను నా కూతురి చిత్రపటాన్ని ఆలింగనం చేసుకుని ఈరోజు నీకు న్యాయం జరిగిందని చెప్పాను. 2012లో యావత్తు దేశం తలదించుకుంది. ఇంతటితో నా పోరాటం ఆగదు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది” అని నిర్భయ తల్లి ఆశాదేవీ అన్నారు.