మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌవాన్
మధ్యప్రదేష్ లో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 2గంటలకు శాసనసభలో బలపరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తగిన సంఖ్యాబలం లేకపోవడంతో కమల్ నాథ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో మధ్యప్రదేష్ లో భాజాపా ప్రభుత్వం కొలువుదీరనుంది. శివరాజ్ సింగ్ చౌవాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. 230 శాసనసభ స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 228 ఎమ్మెల్యేలుండగా.. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 22 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందడంతో ఎమ్మెల్యేల సంఖ్య 206కు చేరింది. ప్రస్తుతం బలపరీక్షలో ఏ పార్టీ నెగ్గాలన్నా 104 మంది ఎమ్మెల్యేలు అవసరం. భాజపాకు 107 మంది సంఖ్యా బలం ఉంది. కాంగ్రెస్ కు 92 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇతర పార్టీలకి చెందిన వారు 7గురు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా శివరాజ్ సింగ్ చౌవాన్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.