ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది : అనుష్క  

ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కానీ, తనకు ఎప్పుడూ ఆ అనుభవం ఎదురుకాలేదని చెప్పింది స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో అనుష్క నటించిన సినిమా ‘నిశ్శబ్ధం’. అంజలి, షాలినీ పాండే, మాధవన్‌, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పదేలా ఉంది. అయినా సినిమా ప్రమోషన్స్ మాత్రం కొనసాగిస్తున్నారు. 

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అనుష్క క్యాస్టింగ్‌ కౌచ్‌ పై స్పందించారు. “ఇక్కడ క్యాస్టింగ్‌ కౌచ్‌ లేదని నేను చెప్పను. కానీ అదృష్టవశాత్తూ నాకెప్పుడూ అలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. ఎందుకంటే నేను చాలా ముక్కుసూటిగా మాట్లాడుతుంటా. ఎవరైనా సరే.. ఓ మహిళ నుంచి ఇలాంటి ప్రతిఫలం ఆశించడం తప్పు. నాకు తెలిసి ఇది ఒకరి వ్యక్తిగత అభిప్రాయం. చిత్ర పరిశ్రమలో అతి సులభంగా రాణించాలా?, కష్టపడి నిలదొక్కుకోవాలా?.. ఇలాంటి విషయాల్ని మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మహిళ నో చెబుతుందో.. అప్పుడే పురుషుడు మహిళల్ని గౌరవించడం ప్రారంభిస్తాడు” అని చెప్పుకొచ్చింది.