జనతా కర్ఫ్యూకి కాంగ్రెస్ మద్దతు
దేశం కోసం నిలబడినప్పుడు రాజకీయాలు పక్కన పెట్టాల్సిందే. ఇప్పుడు కరోనాని కట్టడి చేసి.. జాతిని కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 9గంటల వరకు దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. దీనికి అన్నీ పార్టీలు, అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ కూడా జనతా కర్ఫ్యూకి మద్దతు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు రేపు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చర్యలు మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. కర్ఫ్యూ వల్ల పేదలు, దినసరి కూలీలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున.. తెలుపు రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలు సరఫరా చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.