జనతా కర్ఫ్యూకి టాలీవుడ్ సపోర్ట్
కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సినీ స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు శుభ్రత పాటించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి, ఎన్ టీఆర్, రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆదివారం నిర్వహించబోతున్న జనతా కర్ఫ్యూకి టాలీవుడ్ మద్దతు తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్టీఆర్, రాజశేఖర్, బోయపాటి శ్రీను తదితరులు సోషల్‌మీడియా వేదికగా అభిమానులను, “ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’లో భాగంగా ప్రతి భారతీయుడు ఇంటిలోనే ఉండాలని, బయటికి రాకూడదని కోరుతున్నా. ఐకమత్యంగా కరోనా వైరస్‌పై పోరాడుదాం” అని రాజమౌళి ట్వీట్ చేశారు. “కొవిడ్-19ని జయించాలంటే మనవంతు కృషి చేయాలి. రేపు జరిగే ‘జనతా కర్ఫ్యూ’ని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అని ఎన్టీఆర్ ట్విట్ చేశారు.