డేంజర్ : కరీంనగర్’లో తొలి కరోనా కేసు
కరీంనగర్ లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్థానికుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కరీంనగర్ ప్రజల్లో భయాంధోళనలు నెలకొన్నాయి. ఇతడు ఇండోనేషియా దేశస్తులతో కలిసి తిరిగాడు. ఇటీవల కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియా దేశస్తులకి కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. వారిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇండోనేషియా బృందంతో తిరిగినవారిని గుర్తించి వారికి కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇండోనేషియా బృందంతో తిరిగిన కరీంనగర్ స్థానికుడుకి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇండోనేషియా బృందం కరీంనగర్ లో మూడు ప్రాంతాల్లో తిరిగినట్టు తెలుస్తోంది. ఇప్పుడా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్ లో కరోనా రెండో స్టేజ్ లో ఉంది. అది గనుక మూడో స్టేజ్ కి చేరితే కట్టడి చేయడం కష్టమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వ సూచనలు పాటించి.. ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు.