లాక్డౌన్ పై ప్రధాని అసంతృప్తి
కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 80 జిల్లాల్లో లాక్డౌన్ విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పూర్తిగా ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే ప్రజలు లాక్డౌన్ ని పాటించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
లాక్డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం వహించరాదని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. అందరూ ఆరోగ్య సూచనలు పాటించాలని ఆయన సోమవారం ట్విటర్ వేదికగా సూచించారు. ‘లాక్డౌన్ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండరాదు. దీన్ని ఎందుకు అమలు చేశామో గుర్తించాలి. లాక్డౌన్ను తీవ్రంగా పరిగణించి ప్రజలు అందరూ ఆచరించాలి. ప్రతి ఒక్కరూ విధిగా లాక్డౌన్ నియమాలు పాటించాలి. మనల్ని మనం రక్షించుకోవడానికే లాక్డౌన్ విధించాం. దీని గురించి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలి’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.