లాక్‌డౌన్‌ మరో పది రోజులు పెంపు ?

కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. 82 జిల్లాల్లో కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. 20 రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే ప్రజలు లాక్‌డౌన్‌ సరిగ్గా పాటించకపోవడంతో కేంద్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. బయటికి రావొద్దు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని పదే పదే కోరుతున్నా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ సమయంలో రూల్స్ ని మరింత కఠినతరం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకి సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సాయంత్రం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి.. వాటిని తెలియజేయనున్నారు. మరోవైపు ఈ నెల 31 వరకు మాత్రమే కాదు. అవసరమైతే.. మరో పదిరోజుల పాటు కూడా లాక్‌డౌన్‌  కొనసాగించే ఆలోచనలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉన్నట్టు సమాచారమ్.