చౌరస్తా బృందం కరోనా సాంగ్.. సూపర్ హిట్ !

“చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా.. “ఇప్పుడు ఏ ఫోన్‌ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే పాట. విడుదలైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.  తెలుగు జానపద బ్యాండ్‌ ‘చౌరస్తా’ ఈ పాటని తీసుకొచ్చింది. రామ్‌, శ్రీనివాస్‌, యశ్వంత్‌, బాలా.. ఈ నలుగురు మిత్రులు కలిసి ప్రారంభించిన బ్యాండ్ ఇది.

“పౌరుల్లో కొరవడిన స్పృహ వైరస్‌ విస్తరించేందుకు సహకరిస్తోంది. ప్రభుత్వాలు ఎంత వద్దని చెప్పినా ఏ అవసరం లేకున్నా కొందరు రోడ్లపైకి వస్తున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల దేశం ఎలా నష్టపోతోందో చెపుతూ.. పౌర బాధ్యతను గుర్తు చేసేందుకే ఈ పాట రాసినట్లు” చౌరస్తా బృందం తెలిపింది.

“చేతులెత్తి మొక్కుతా చేయిచేయి కలపకురా..

కాళ్లు కూడ మొక్కుతా అడుగు బయట పెట్టకురా.. ఉన్నకాడే ఉండరా గంజితాగి పండరా..

మంచి రోజులొచ్చెదాకా నిమ్మలంగా ఉండరా..!”

“ఏ సిగరెట్లు, చాక్లెట్లు, రోడ్ల మీద ముచ్చట్లు

బతికుంటే పెట్టుకుందాం ఇప్పుడైతే బందువెట్టు..

ప్రజలందరి ప్రాణాలు నీ చేతిల ఉన్నయిరా..

బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా..!”