కరోనా కేసులు : చైనా, ఇటలీని దాటేసిన అమెరికా
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు రోజురోజూకి పెరుగుతున్నాయి. చైనా, ఇటలీని దాటేసేలా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం చైనాపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించడంతో పాటు.. కొవిడ్-19 తీవ్రతను ప్రపంచానికి తెలియజేయడంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు అమెరికా కూడా కరోనాని కట్టడి చేయడంలో విఫలం అవుతోంది.
చైనా, ఇటలీని దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. గురువారం నాటికి ఆ దేశంలో 83,545 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీరిలో 1,201 మందికి పైగా మృత్యువాతపడ్డారు. చైనాలో ఇప్పటి వరకు 81,285 మంది, ఇటలీలో 80,589 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఒక్క న్యూయార్క్‌లోనే 38వేల మంది వైరస్ బారిన పడగా.. 281 మంది మరణించారు. అయితే చైనా, ఇటలీతో పోలిస్తే మరణాల సంఖ్య అమెరికాలో తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశం. ఇక కరోనా వైరస్ వ్యాప్తిపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం తెలిపిన సంగతి తెలిసిందే.