సజ్జనార్ సూచన.. జంక్ ఫుడ్ వద్దు !

దేశంలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట మార్చి 31 వరకు మాత్రమే లాక్‌డౌన్‌ ప్రకటించగా.. దాన్ని వచ్చే నెల 14 వరకు పొడగించింది కేంద్రం. ఇక తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు లాక్‌డౌన్‌ ఉల్లంఘించకుండా చూడటం పోలీసులకి సవాల్ గా మారింది. ఓ వైపు శాంతిభద్రతలని కాపాడుతూనే.. మరోవైపు కరోనా పట్ల ప్రజలకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు.

శుక్రవారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ కరోనా నియంత్రణ నేపథ్యంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మీడియాతో మాట్లాడారు. కమిషనరేట్‌ చుట్టూ 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. అలానే అంతర్గతంగా 55 జంక్షన్లు ఉన్నాయి. ఎమర్జెన్సీ ఉన్న వాళ్లు, పాస్‌లు కలిగిన వాళ్లు మాత్రమే బయట తిరుగుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జంక్‌ ఫుడ్‌కు సంబంధించిన పదార్థాలని ప్రజలు ఎక్కువ తీసుకెళ్తున్నారు. ప్రజలు ఇంట్లో ఉండి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. జంక్‌ ఫుడ్‌ తిని అనారోగ్యానికి గురికావద్దని సూచించారు సజ్జనార్.