ఏప్రిల్‌ 15 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు


రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తప్పని పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15 వరకు పొడిగిస్తున్నాం. రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇప్పటికే వైరస్‌ చాలా వరకు నియంత్రణలోకి వచ్చింది. దాన్ని మరింత నియంత్రణలోకి తీసుకురావాలన్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈరోజు 10 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో దీనికి మందు లేదు.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు. కాబట్టి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం. గుంపులుగా రోడ్ల మీదకు రాకపోవడం, స్వీయ నియంత్రణ, పారిశుద్ధ్యం పాటించడం తప్ప మనకి గత్యంతరం లేదు. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.