ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం.. 5గురు మృతి !
లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రభుత్వం విజ్ఝప్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కఠిన సమయాన సొంతూరులో ఉండాలని ఆశపడిన కర్ణాటకకి చెందిన కూలీలు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. శనివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. టాటాఏస్ వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందారు.
మృతులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. లాక్ డౌన్ నేపథ్యంలో కూలీ పనులు నిలిచిపోవడంతో సూర్యాపేట నుంచి వీరంతా స్వస్థలం రాయచూర్‌కి బయలుదేరారు. ప్రమాద సమయంలో లారీ,టాటా ఏస్‌లో కలిపి 30 మంది వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ మరికొందరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ఒక చిన్నారి,బాలిక కూడా ఉన్నారు.