ఓ వైపు బర్త్ డే గిఫ్ట్.. మరోవైపు పెళ్లి వాయిదా ప్రకటన !
యంగ్ హీరో నితిన్ ఆదివారం ఓ గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. నితిన్ బర్త్ డే కానుకగా రంగ్ దే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దీంతో పాటు తన పెళ్లి వాయిదాపై నితిన్ అధికారిక ప్రకటన కూడా చేశారు.
“నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రాకూడని లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో మార్చి 30న నా పుట్టినరోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నా. అందుకే నా పుట్టినరోజు వేడుకల్ని జరపొద్దని అభిమాఅనుల్ని కోరుతున్నా. అంతేకాదు, లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16న జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నా. మనమంతా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలి. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లో.. కాలు మీద కాలేసుకొని, మన కుటుంబంతో సమయం గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు. ఎప్పుడూ మీ అభిమానంతోపాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే నితిన్” అని ప్రకటనలో పేర్కొన్నారు.