ఏపీ ఎస్‌ఈసీ రమేష్ కుమార్ తొలగింపు.. ఇప్పుడే ఎందుకు ?
దేశం మొత్తం కరోనా ఫీవర్ నడుస్తుంటే.. ఏపీలో మాత్రం రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో రమేష్ కుమార్ తొలగించాల్సిన అవసరం ఏముంది ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు మార్చి 15న రమేశ్‌కుమార్ ప్రకటించారు. దీనిపై సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఎస్ ఈసీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులునెలకొన్నాయి.
ఇదీగాక కరోనా వైరస్ ప్రభావంతో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలతో పాటు రూ.వెయ్యి చొప్పున నగదు సాయం ప్రకటించింది. ఆ సాయాన్ని వైకాపాకు చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థులు పంపిణీ చేస్తున్నారని.. ఇది అధికార దుర్వినియోగమంటూ విపక్షాలకు చెందిన కొందరు నేతలు ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు లేఖలు రాశారు. ఇవన్నీ ముదరక ముందే రమేష్ కుమార్ కి చెక్కే పెట్టేసింది ఏపీ ప్రభుత్వం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.